దేవరకద్ర వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి ఇచ్చిన వాంగ్మూలం పోలీసులకు అందింది. ఆ మరక్షణమే ఆ ప్రాంత ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి (తెదేపా) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాజేశ్వరి మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే.. మంగళవారం అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం గమనార్హం.
దేవరకద్ర వ్యవసాయ అధికారిణిగా విధులు నిర్వహిస్తూ వచ్చిన రాజేశ్వరి రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. ఆమె తుదిశ్వాస విడిచే ముందు మరణ వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే సీతా దయాకర్, జడ్పీటీసీ ఛైర్మన్ ఒత్తిడి మేరకు తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు.
ఈ వాంగ్మూలం పోలీసులకు వచ్చింది. దీంతో సీతా దయాకర్‌ను అరెస్టు పోలీసులు అరెస్టు చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి. వెంటనే ఆమె కనిపించకుండా పోయారు. దీనిపై ఆమె భర్త, మక్తల్ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనన్నారు. రాజేశ్వరి మృతితో తన భార్య సీతా దయాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇదిలావుండగా, తెలుగుదేశం పార్టీకి ప్రకటించిన కొత్త కార్యవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తోంది. తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన సీతా దయాకర్ రెడ్డి ఈ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యేంత వరకు ఈ పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ఆమె తెలిపారు.