ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు భేష్!: సబిత (News| AP News| Sabita Indra Reddy| Flood| Police| Rosaiah| DGP)
వరద ముంపు ప్రాంతాల్లో పోలీసులు చేసిన సహాయక చర్యలు ఎనలేనివని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల వరద ముంపు ప్రాంతాల్లో పోలీసులు చేసిన సేవలు మరుపురానివని మంత్రి కొనియాడారు.
బుధవారం గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ఆమె మాట్లాడుతూ.. మన రాష్ట్ర పోలీసులకు ఇచ్చే శిక్షణా పద్ధతుల్ని కూడా ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. అలాగే మన రాష్ట్ర పోలీసులు ఇతర రాష్ట్ర పోలీసులకు ఆదర్శంగా నిలిచారని ఆమె పేర్కొన్నారు.
నగరంలోని గోషా మహల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరు సంస్మరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, డీజీపీ గిరీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు మంత్రులు ఘనంగా నివాళులు అర్పించారు.
డీజీపీ గిరీష్ కుమార్ పోలీసుల వసతి గృహాల సముదాయానికి రూ.10కోట్లు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. వచ్చే మూడేళ్లలో 37వేల మంది సిబ్బంది నియామకాన్ని పూర్తి చేస్తామని డీజీపీ తెలిపారు.
మరోవైపు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఇకపై షిఫ్ట్ విధానంలో విధులను నిర్వర్తించే అవకాశం కల్పించనున్నట్లు డీజీపీ ఆర్. ఆర్. గిరీష్ కుమార్ ప్రకటించారు. మొదట నగరాల్లో, ఆ తర్వాత దశలవారీగా మొత్తం పోలీసు శాఖలో ఈ విధానం అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.