వరద బాధితులకు తన వంతు సాయం చేసేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నడుంబిగించారు. భుజాన జోలె వేసుకుని విరాళాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రజానీకాన్ని అర్థిస్తున్నారు. దీనికి ప్రరాపాకు గట్టిపట్టున్న విశాఖ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఈ జిల్లాలో యాభై లక్షలను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
తొలి రోజైన శుక్రవారం నిర్వహించిన విందు, ఇతరాత్రా కార్యక్రమాల్లో సుమారు 30 లక్షల రూపాయల వరకు విరాళాలు వచ్చినట్టు సమాచారం. అలాగే రెండో రోజైన శనివారం మిగిలిన మొత్తం వచ్చినట్టు ప్రరాపా నేతలు చెపుతున్నారు. రెండు రోజుల్లో వచ్చిన విరాళాల మొత్తాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడిస్తారని వారు ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
విరాళాల సేకరణలో భాగంగా విశాఖపట్నంలో శనివారం ఆయన జోలెయాత్రకు శ్రీకారం చుట్టారు. గురుద్వారా వద్ద ప్రారంభమైన చిరు జోలె యాత్ర సీతమ్మధార, ఆర్టీసీ కాంప్లెక్స్, వన్ టౌన్ ప్రాంతాల్లో కొనసాగింది. రాష్ట్రాన్ని ఇటీవల అతలాకుతలం చేసిన వరదల మూలంగా సర్వస్వం కోల్పోయిన వరద బాధితుల కోసం ఆయన జోలె యాత్ర ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.