ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెరాస జైల్‌భరో: కేసీఆర్ ఆరెస్టు (Free Zone | Hyd | TRS | KCR | Jailbharo | Arrest | Assembly | Rally)
ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెరాస జైల్‌భరో: కేసీఆర్ ఆరెస్టు
బుధవారం, 28 అక్టోబర్ 2009( 16:39 IST )
హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించడాన్ని ఖండిస్తూ తెలంగాణా రాష్ట్ర సమితి బుధవారం తెలంగాణా ప్రాంతాల్లో జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణా జిల్లాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు నాయకత్వం వహించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగిన జైల్‌భరో కార్యక్రమానికి తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నాయకత్వం వహించారు.
ఆ తర్వాత ఆయన నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రాష్ట్ర సచివాలయం వైపు ర్యాలీగా దూసుకువెళుతున్న కేసీఆర్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారిని కూడా అరెస్టు చేసిన గోషామహల్ స్టేడియంకు తరలించారు. సచివాలయం వైపు వెళ్ళేందుకు అనుమతి లేనందున ముందుకు వెళ్ళరావద్దని పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ కేసీఆర్ సహా ఆందోళనకారులు వినిపించుకోకుండా మొండిగా వ్యవహరించడంతో పోలీసులు వారికి అడ్డుగా నిలవడంతో తోపులాటకు దారి తీసింది.
దీనితో ఇందిరాపార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశంపై కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద బుధవారం జైల్ భరో నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ జైల్‌భరో సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడవద్దని కేసీఆర్ పిలుపు ఇవ్వడంతో ప్రశాంతంగా సాగాయి.