ముఖ్యమంత్రి రోశయ్య శాసన సభ్యుడు కానందువల్ల ఆయన కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా ఎన్నుకోబోమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రోశయ్యను సీఎల్పీ నేతగా నామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. సాధారణంగా మంత్రి, ముఖ్యమంత్రి పదవిలో ఉండేవారు మాత్రమే సీఎల్పీ నేతగా ఎన్నుకుంటారని డీఎస్ వివరణ ఇచ్చారు.
డీల్లీ పర్యటలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో వారం పది రోజుల్లో సీఎల్పీ సమావేశం జరుగుతుందన్నారు. తేదీని మాత్రం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేస్తారని స్పష్టం చేశారు. అది ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ వచ్చివెళ్లాక ఉంటుందా, ముందే ఉంటుందా అన్నది చెప్పలేనన్నారు.
ముఖ్యమంత్రిగా మరికొంత కాలం రోశయ్య కొనసాగుతారనే విష యంలో తనకెలాంటి అనుమానాలు లేవని డీఎస్ తేల్చి చెప్పారు. వైఎస్ ఉన్నంతకాలం ఇతరులెవరూ ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించలేదని, ఆయన మరణం తరువాతనే పలువురు ఆ పదవి గురించి మాట్లాడుతున్నారని డిఎస్ అన్నారు.