ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణంతో కొండా సురేఖ మానసిక వేదన అనుభవిస్తున్నారని, అందువల్లే ఆమె మంత్రిపదవికి రాజీనామా చేశారని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. ఆమె రాజీనామా వల్ల ఎలాంటి నష్టం వాటిల్లబోదని ఆయన శుక్రవారం తేల్చి చెప్పారు.
దీనిపై ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ దుర్మరణం తననే కాకుండా, రాష్ట్ర ప్రజానీకాన్ని కలిసి వేసిందన్నారు. అయితే, వైఎస్‌ను అమితంగా అభిమానించే మంత్రుల్లో కొండా సురేఖ ఒకరన్నారు. వైఎస్ మృతిని ఆమె తట్టుకోలేక పోయారన్నారు. దీంతో గత రెండు నెలలుగా ఆమె మనో వేదన అనుభవించారని గుర్తు చేశారు.
అందువల్లే ఆమె వైఎస్ లేని చోట పని చేయలేక రాజీనామా చేశారని తెలిపారు. ఆమె రాజీనామా లేఖను ఆమోదించాల్సిందిగా గవర్నర్ తివారీకి లేఖ రాసినట్టు రోశయ్య తెలిపారు. అలాగే, సురేఖ అంశం గ్రేటర్ ఎన్నికలతో పాటు.. సీఎల్పీ నేత ఎన్నికలో ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు.