ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సురేఖ "రాజీనామా"ను 'రాజకీయం' చేయొద్దు..!: దానం (Konda Surekha| Rajinama| Minister| Politics| YSR| Sabita| Danam Nagender)
దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణంతో ఏర్పడిన మానసిక క్షోభతోనే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. అయితే సురేఖ రాజీనామాను రాజకీయం చేయడం సబబు కాదని దానం చెప్పారు.
ఈ విషయాన్ని వక్రీకరించడం ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టే నైతిక హక్కు ఎవరికీ లేదని దానం అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని దానం వెల్లడించారు. వైఎస్సార్ మరణంపై ఆమె తన బాధను వ్యక్తం చేసినప్పుడు దాన్ని మానవతా దృక్పథంతో ఆలోచించాలే కానీ రాజకీయం చేయడం తగదని దానం నాగేందర్ హితవు పలికారు.
ఇదిలా ఉంటే.. సురేఖ రాజీనామా విషయం ఆమె వ్యక్తిగతమని గిరిజన సంక్షేమ శాఖమంత్రి బాలరాజు అన్నారు. అధిష్టానం నిర్ణయానికే తామంతా కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు కొండా సురేఖ రాజీనామా పార్టీపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకోసమే మంత్రివర్గంలో కొనసాగుతున్నానని సబితా తెలిపారు. జగన్‌కు లాభం చేకూరుతుందంటే రాజీనామాకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.
ఇకపోతే.. వైఎస్సార్ లేని మంత్రివర్గంలో కొనసాగలేనని పేర్కొంటూ గురువారం రాత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.