ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ ప్రకంపనలు: నేడు వైఎస్.జగన్ శిబిరం భేటీ! (GHMC | Hyd | Election | YS | Jagan | PRP | Congress | Chiru | DS)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల హడావుడి రాష్ట్రంలో ఆరంభమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు కలిసి పోటీ చేయాలని భావించాయి. ఈ కలయిక వైఎస్.జగన్ శిబిరాన్ని కలవరపెడుతోంది. దీనిపై చర్చించేందుకు జగన్ శిబిరం సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇందుకోసం కడప పార్లమెంట్ సభ్యుడు జగన్ హుటాహుటిన సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఆయన తన అనుచరులు, కుటుంబ ఆప్తమిత్రుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావులతో కలిసి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యత చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలు కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రరాపాలు ఒంటరిగా పోటీ చేయాలని భావించాయి.
అయితే, చివరి నిమిషంలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు ప్రరాపా నాయకత్వం ఈ పొత్తుకు సమ్మతం తెలిపాయి. అయితే, ఈ పొత్తుకు కాంగ్రెస్‌లోని కొందరు మంత్రులు, నేతలు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా, జగన్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ప్రరాపాతో పొత్తు వద్దని, ఒంటరిగానే బరిలోకి దిగాలని డిమాండ్ చేస్తోంది. అయితే, అధిష్టానం నిర్ణయం మేరకే ప్రరాపాతో పొత్తు పెత్తుకోనున్నట్టు పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ఫలితంగా జగన్ వర్గం ఏం చేయాలో తోచక, తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై భేటీ కానుంది.