జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » "పొత్తు" పొడుపు: కాంగ్రెస్‌-ప్రరాపాలో ప్రకంపనలు! (Congress | PRP | Politics | Jagan | GHMC | YS | DS | Chiranjeevi)
Feedback Print Bookmark and Share
 
File
FILE
ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం రాష్ట్ర రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. వైఎస్ ఉన్నంత వరకు నోరు మెదిపేందుకు సాహసం చేయని అధికార, ప్రతిపక్ష నేతలు ఇపుడు తమేద రాజ్యమన్నట్టుగా వ్యవహరిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి వాటిలో "కాంగ్రెస్-ప్రరాపా పొత్తు" అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. ప్రజారాజ్యం పార్టీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించింది. దీనిపై అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది జగన్ వర్గానికి చెక్ పెట్టేందుకు గాను మరో వర్గం పన్నిన కుట్రలో భాగమేనని వారు అంటున్నారు.

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా కైవసం చేసుకోలేని ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవడం ఒక విధంగా ఆత్మాహత్యా సదృశ్యమేనని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి అంటున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... ప్రరాపాలో టిక్కెట్లు అమ్ముకుని చెడ్డపేరు సంపాదించుకున్న అల్లు అరవింద్‌తో పీసీసీ చీఫ్ శ్రీనివాస్ చర్చల జరపడం వెనుక ఆంతర్యమేమని ప్రశ్నిస్తున్నారు.

జీహెచ్ఎంసీ పరధిలో అధిక సంఖ్యలో సీట్లు కైవసం చేసుకోవాలంటే ప్రరాపాతో కంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే క్లీన్‌స్వీప్ చేయవచ్చని ఈ అనకాపల్లి ఎంపీ హరి ఎద్దేవా చేశారు. అందువల్ల ప్రరాపాతో పొత్తు యోచనను అధిష్టానం విడనాడాలని కోరారు.

అలాగే కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రరాపాతో పొత్తు అవసరమా...? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తేనే మరిన్ని సీట్లు దక్కుతాయని ఆయన గుర్తు చేశారు. అసలు ఈ పొత్తును ఎట్టిపరిస్థితుల్లోను తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు.

ఇకపోతే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ.. ప్రపాతో పొత్తు కంటే.. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కృషి చేయాలన్నారు. తమ పార్టీలో చేరేందుకు ఎంతమంది మెగాస్టార్లు, సాదా స్టార్లు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. అలాగే హస్తం గుర్తుపై పోటీ చేయడాన్ని కూడా హర్షిస్తామన్నారు. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రరాపాతో చేతులు కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు రాజగోపాల్ తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్‌తో కలిసి నడవాలని అధ్యక్షుడు చిరంజీవి తీసుకున్న నిర్ణయం పట్ల గ్రేటర్ ప్రరాపా నేతలు మండిపడుతున్నారు. మాటమాత్రం తమకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద గ్రేటర్ పొత్తు అంశం ఇరు పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తుండగా, కాంగ్రెస్‌లో మాత్రం ఎక్కువగానే ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.