గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించిన పక్షంలో, తాడోపేడో తేల్చుకోవాలనే తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఈనెలలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీలు కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీనిపై ఇరు పార్టీల అగ్రనేతలు అధికారిక ప్రకటన చేయాల్సి వుంది. పొత్తుకు ప్రరాపా అధినేత చిరంజీవితో పాటు.. ఇతర సీనియర్ నేతలు ఇప్పటికే ఆమోదం తెలిపారు.
దీనిపై జగన్ వర్గం అసంతృప్తితో రగిలి పోతోంది. దీనిపై చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్.జగన్ తన అనుచరులతో సోమవారం ఉదయం ఆకస్మికంగా సమావేశమయ్యారు. ఇందులో అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చించారు. పొత్తును తీవ్రంగా వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ తమ డిమాండ్‌పై సరైన స్పందన లేకపోతే ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. పనిలోపనిగా ఈనెల నాలుగో తేదీన జగన్ ఢిల్లీకి వెళ్లనున్న విషయం తెల్సిందే.