ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. తాము తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తామని సినీ నటుడు రాజశేఖర్ వెల్లడించారు. కాంగ్రెస్‌కు పీఆర్పీతో పొత్తు పెట్టుకోవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే.. జరిగిన అన్ని విషయాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ సంయమనం పాటించారని.. ఇలాంటి సమయంలో జగన్ నోరు విప్పాల్సిన అవసరం ఉందని రాజశేఖర్ కోరారు.
ఓ ప్రైవేట్ ఛానెల్‌తో రాజశేఖర్.. ఆయన సతీమణి.. జీవితలు మాట్లాడారు. పీఆర్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. రానున్న ఎన్నికల్లో వారిని ఓడించేందుకైనా.. తాము టీడీపీలో చేరుతామన్నాడు. అయితే ఈ విషయంపై జీవిత మిశ్రమంగా స్పందించారు. పొత్తు కుదిరితే.. ఏం చేయాలో అప్పుడు నిర్ణయిస్తామని జీవిత తెలిపారు.
ఇప్పటి వరకు.. ఇటీవల వచ్చిన వరద సహాయం వంటి అంశాలతో సహా.. పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ఏ విధంగా ప్రజలకు సాయం అందించారని జీవిత ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌ను తీవ్రంగా దూషించిన పీఆర్పీ.. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందో.. వెల్లడించాలని కోరారు.