ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవించివున్నపుడే ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై చర్చకు వచ్చిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రరాపా పొత్తుపై ఆయన సోమవారం తన స్పందనను వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో తప్పులేదన్నారు. అధిష్టానం అనుమతితోనే ఈ పొత్తు పెట్టుకుంటోందన్నారు. ఈ పొత్తు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే కాకుండా, భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో సైతం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని, అయితే, పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండటం సాధారణమేనని అన్నారు.
అసలు ఈ పొత్తు చర్చ వైఎస్సార్ జీవించి ఉన్న సమయంలోనే జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ప్రతిపాదన రాగా, అది కార్యరూపం దాల్చలేదని దివాకర్ రెడ్డి అన్నారు. ఈ పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్లితే ఇరు వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.