ప్రజారాజ్యంతో పొత్తు ప్రస్తావన లేదు: వీరప్ప మొయిలీ
సోమవారం, 2 నవంబర్ 2009( 17:26 IST )
ప్రజారాజ్యంతో పొత్తు ప్రస్తావనే రాలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పొత్తు చర్చలు సాగలేదని ఆయన సోమవారం ఢిల్లీలో స్పష్టం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. అసలు పొత్తు అంశం ప్రస్తుతం తమకు చర్చనీయాంశమే కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ప్రజారాజ్యం పార్టీ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు పొత్తు అనే సమస్యే లేనప్పుడు తాను వివరణ ఇవ్వాల్సిన అవసరమేముందన్నారు. ఢిల్లీలో మొయిలీ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
మొయిలీ తాజా వాఖ్యలతో కాంగ్రెస్ - ప్రజారాజ్యంల మధ్య పొత్తు వ్యవహారం రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌తో పొత్తుకు అనుకూలంగా పీఆర్పీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన వెంటనే ఢిల్లీ నుంచి పీసీసీ చీఫ్ శ్రీనివాస్‌ను ఫోన్‌లో వివరణ కోరినట్లు తెలుస్తోంది.
అయితే, హైదరాబాద్‌లో పీసీసీ చీప్ ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజరాజ్యం పార్టీతో ప్రాథమిక దశలో పొత్తు చర్చలు జరిగాయన్నారు. పూర్తి వివరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తుది నిర్ణయం హైకమాండే తీసుకుంటుందని చెప్పారు.