ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల బెడద ఉన్నట్టు రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ అంగీకరించారు. అందువల్ల సరిహద్దు జిల్లాల పోలీసు యంత్రాంగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తీవ్రవాదాలు, ఉగ్రవాదుల వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు హింసాయుత ధోరణిని వదిలిపెట్టి, తమ విధావిధానాలను మార్చుకుని, జన జీవన స్రవంతిలో కలిసి పోవాలని ఆయన సూచించారు.
మావోల పట్ల ప్రజల్లో ఏమాత్రం సానుభూతి లేదని ఆయన జోస్యం చెప్పారు. అదేసమయంలో పోలీసు శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చే ప్రజలను గౌరవించేలా పోలీసులు నడుచుకోవాలని ఆయన హితవు పలికారు.