జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గ్రేటర్ పొత్తు ఎఫెక్టు: రెంటికీ చెడ్డ రేవడిగా ప్రజారాజ్యం (GHMC | PRP | Chiru | Congress | DS | Hyd | High Command)
Feedback Print Bookmark and Share
 
అధికార కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల పొత్తు పెటాకులైంది. ఈ రెండు పార్టీలు చేతులు కలిపి యుగళగీతం ఆలపించాలన్న కలలు కల్లలయ్యాయి. ఇరు పార్టీలు ఏక తాటిపై నడవాలని అనుకున్న రోజే కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు భగ్గుమన్నాయి. ఫలితంగా పీఆర్పీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ప్రతిపాదన వికటించింది.

ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకూ కాంగ్రెస్ చెప్పిన కథలు విని విని విసిగిపోయిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చివరకు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారు.

రాష్ట్రంలోని రాజకీయవర్గాలను విస్మయానికి గరిచేసి, కాంగ్రెస్‌లో కలతలు సృష్టించిన ఈ ప్రహసనంలో రెండు పార్టీల అధ్యక్షులు పరువు పోగొట్టుకున్నారు. అధిష్టానం అనుమతి తీసుకున్నప్పటికీ రాష్ట్ర స్థాయి నాయకులతో సమగ్రంగా చర్చించకుండా, అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకోకుండా ప్రజారాజ్యంతో పొత్తు కోసం ఒంటెద్దు పోకడకు పోయారన్న అపకీర్తి పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ మూటగట్టుకున్నారు.

ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టమేమిటని లోతుగా చర్చించకుండా... జోగయ్య లాంటివారితో ముందస్తు ప్రకటనలు చేయించి, గ్రేటర్‌ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలన్న చిరంజీవి కల చివరకు మొయిలీ ప్రకటనతో నీరుగారిపోయింది. మొయిలీ వ్యాఖ్యల ప్రకారం కాంగ్రెస్‌తో ఇక పొత్తు చర్చలు అనవవసరమన్న తుది నిర్ణయానికి పీఆర్పీ నేతలు వచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.

తాజా పరిణామాలతో ఖంగుతిన్న ప్రజారాజ్యం పార్టీ నేతలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్లాలో అర్థంకాక తలలు పట్టుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్-ప్రరాపా పొత్తును కొందరు వ్యతిరేకించగా, మరికొందరు చిరంజీవిపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తం మీద కాంగ్రెస్-ప్రరాపాల పొత్తు అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించగా, మీడియాకు పసందైన చర్చా వేదికను కల్పించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.