గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్-ప్రజారాజ్యం పార్టీల మధ్య చర్చకు వచ్చిన పొత్తు అంశానికి ఆదిలోనే బ్రేక్ పడింది. తాజాగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వామపక్ష పార్టీ అయిన సీపీఎంతో పొత్తుకు అర్రులు చాస్తోంది.
కాంగ్రెస్-ప్రరాపా పొత్తును తీవ్రంగా తప్పుబట్టిన తెదేపా నేతలు ఇపుడు సీపీఎంతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించడం గమనార్హం. ఇందుకోసం సీపీఎం నేత బీవీ.రాఘవులుతో చర్చలు జరిపేందుకు తెదేపా నేతలు సన్నద్ధమవుతున్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మంగళవారం ప్రకటిస్తామని సీపీఎం ప్రకటించడంతో తెదేపా నేతలు అప్రమత్తమయ్యారు.
తెదేపా నేతలు కంబంపాటి రామ్మోహన్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గరికపాటి మోహన్‌లు గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అంశంపై రాఘవులుతో భేటీ కావాలని నిర్ణయించారు. అయితే, మరో వామపక్ష పార్టీ అయిన సీపీఐ మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.