ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » దురుద్దేశ పూరితంగానే అసత్య ప్రచారం: కేకే (Jarkhand | Election | Assembly | KK | Delhi | Jagan | CM | Media)
తనపై దురుద్దేశ పూరితంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు మండిపడ్డారు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక్కో ఔత్సాహిక అభ్యర్థి నుంచి టిక్కెట్లు కేటాయించేందుకు తన అనుచరులు రూ.ఐదు లక్షలు చొప్పున డబ్బులు డిమాండ్ చేసినట్టు మీడియా ప్రచారం చేసింది.
దీన్ని ఖండిస్తూ కేశవరావును ఢిల్లీలో మంగళవారం ఘెరావ్ చేశారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. వైఎస్ తనయుడు వైఎస్.జగన్ ముఖ్యమంత్రి కాకుండా కేకే అడ్డుకుంటున్నారని ఇప్పటికే రాష్ట్రంలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేకేను జార్ఖండ్ నేతలు కొందరు ఘెరావ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ఆయన బుధవారం ఢిల్లీలో స్పందిస్తూ.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఈ అంశంలో కనీసం తన వివరణ, అభిప్రాయం తెలుసుకోకుండా వార్తలు రాయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
ఇందులో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని కేకే మండిపడ్డారు. ఓ వర్గం కావాలనే తనపై అసత్య ప్రచారానికి దిగుతోందని, ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.