ఒకవైపు ముఖ్యమంత్రి రోశయ్యతో మరోవైపు అసమ్మతి వర్గ నేత వైఎస్.జగన్‌తో వారి అనుచరులు పోటాపోటీగా భేటీ అవుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకులుగా ముద్రపడిన వారందరూ ముఖ్యమంత్రి రోశయ్యకు సన్నిహితంగా మెలిగేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాగే వైఎస్ అనుచర వర్గంగా గుర్తింపు పొందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్.జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
దీంతో అటు ముఖ్యమంత్రి రోశయ్య నివాసం, ఇటు జగన్ ఆవాసమైన సీఎం క్యాంపు కార్యాలయంలు నిత్యం సందడిగా కనిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్.జగన వర్గం ముఖ్యమంత్రి రోశయ్యకు సమాంతరంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా ఉంది. ప్రభుత్వ కార్యాకలాపాలపై సీఎం రోశయ్యను కలిసే మంత్రుల సంఖ్య కంటే జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు వచ్చే మంత్రులు సంఖ్యే ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
బుధవారం కూడా కొందరు నేతలు రోశయ్యను కలుసుకున్నారు. అలాగే, తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా సీఎంను కలుసుకుని తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇదిలావుండగా, సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ మరికొందరు మంత్రులు ఉన్నారు.