ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పని చేస్తున్నారని మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు. దీనిపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను డీఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీ చేపట్టే ఎలాంటి చర్యకైనా, పంపే షోకాజ్ నోటీసుకైనా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ప్రాణం పోశారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు అవసరం లేదన్నారు. అయినప్పటికీ.. డీఎస్ అత్యుత్సాహం చూపి ప్రరాపాతో పొత్తుకు ప్రయత్నించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఒకవిధంగా చెప్పాలంటే చిరంజీవిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు.
అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి డీఎస్ రాజీనామా చేయాలని మారెప్ప డిమాండ్ చేశారు. ఇదిలావుండగా, కాంగ్రెస్-ప్రరాపా పొత్తు పొడుపును అడ్డుపెట్టుకుని డీఎస్‌పై మారెప్ప చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం మండిపడింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీసీసీని ఆదేశించడం గమనార్హం.