ప్రజారాజ్యంలో చావని కాంగ్రెస్ "గ్రేటర్" పొత్తు ఆశ!
గురువారం, 5 నవంబర్ 2009( 12:08 IST )
అధికార కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని లాభపడాలని ప్రజారాజ్యం భావిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీతో గ్రేటర్ పొత్తు పెట్టుకునేందుకు ఇంకా ఉవ్విళ్ళూరుతోంది. అందుకే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారు.
త్వరలో జరుగనున్న గ్రేటరే హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్-ప్రజారాజ్యం పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణుల నుంచి భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రరాపాతో పొత్తు లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ప్రకటించారు.
అయితే, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, ఇతర సీనియర్ నేతలు మాత్రం ఇంకా పొత్తుపై ఆశతోనే ఉన్నారు. పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ వైపు నుంచి వస్తున్న భరోసాతో వారు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇదిలావుండగా, ప్రరాపా అధినేత చిరంజీవితో ఆ పార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశం అయ్యారు. ఇందులో కూడా కాంగ్రెస్‌తో పొత్తు అంశంతో పాటు.. అభ్యర్థుల ఎన్నిక, అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చిస్తున్నారు.