రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొణిజేటి రోశయ్య శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన శనివారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవుతారు. ఈ మేరకు అధిష్టానం నుంచి రోశయ్యకు వర్తమానం వచ్చింది.
సోనియాగాంధీతో రోశయ్య భేటీ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) సమావేశం తేదీ ఖరారు కావచ్చని సమాచారం. కాగా, ఈనెల పదో తేదీ తర్వాత సీఎల్పీ భేటీ కావచ్చని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
ఇదిలావుండగా, సీఎంగా రోశయ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీకి తొలిసారిగా వెళుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసిన దురదృష్టకర పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది.