ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » 40 స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రజారాజ్యం: వాసిరెడ్డి పద్మ (PRP | Vasireddy Padma | Chiru | Greater | Hyd | Election)
40 స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రజారాజ్యం: వాసిరెడ్డి పద్మ
శుక్రవారం, 6 నవంబర్ 2009( 11:46 IST )
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం 40 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మల్లగుల్లాలు పడిన ఆ పార్టీ అధిష్టానం గురువారం అర్థరాత్రి సమయంలో పోటీ చేయాలనే తుది నిర్ణయానికి వచ్చింది.
అయితే, పార్టీ ప్రాథమిక నిర్మాణం పూర్తి స్థాయిలో జరగనందున 50 లేదా 40 స్థానాల్లో మాత్రమే పోటీ చేయడమే సముచితమని భావించింది. స్థానిక నేతల ఒత్తిడి మేరకు పార్టీ అధినేత చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలావుండగా... గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రజారాజ్యం పార్టీలో పెద్దఎత్తునే సుదీర్ఘ చర్చ సాగింది. కాంగ్రెస్‌తో పొత్తు విఫలయం అయిపోయిందని తేలిపోయిన తర్వాత ప్రజారాజ్యం నాయకుల్లో పోటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పోటీ చేయకుండా ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో సహకారానికి వీలు ఉంటుందని కాంగ్రెస్ నుంచి కూడా సూచనలు రావడంతో ప్రజారాజ్యం నాయకులు ఆలోచనలో పడ్డారు.
అయితే, అసలు పోటీ చేయకుండా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే కన్నబాబు తదితరులు నచ్చచెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా, గ్రేటర్ ఎన్నికలపై ఆశలు పెట్టకున్న కేడర్ పార్టీకి దూరమై పోతారని వారు హెచ్చరించారు.
అన్ని అంశాలపై నిశితంగా పరిశీలించిన తర్వాత 40 స్థానాల్లో పోటీ చేయాలని ఓ తుది నిర్ణయం తీసుకున్నారు. పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రతినిధి పద్మా తెలిపారు.