ఎన్నికల సమయంలో తప్పుడు ఆరోపణలు చేయడం సహజమేనని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో అధిష్టానం జోక్యం చేసుకోబోదని, ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌లే సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన ఔత్సాహికులు రాజధానిలో శుక్రవారం కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. టిక్కెట్లు రాని అసంతృప్త నేతలు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్, పీసీసీ చీఫ్ డీఎస్‌లపై లేనిపోని ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
దీనిపై ఢిల్లీలో వీరప్ప మొయిలీ మీడియాతో మాట్లాడుతూ... గ్రేటర్ టిక్కెట్ల కేటాయింపుల్లో అవతకవతకలు జరిగాయన్న వార్తలు పూర్తిగా నిరాధారామన్నారు. కార్పొరేట్ టిక్కెట్లను ఆశించిన వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మొయిలీ అన్నారు. గ్రేటర్ ఎన్నికల విషయంలో అధిష్టానం తలదూర్చమని, ఎన్నికల సమయంలో ఇలాంటి విషయాలు మామూలేనని ఆయన అన్నారు. సమస్యను ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌లే పరిష్కరిస్తారని తెలిపారు.
ఇదే అంశంపై హోం మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. టిక్కెట్ల కేటాయింపులో అందరి అభ్యర్థనలను అధిష్టానం పరిగణంలోకి తీసుకుందన్నారు. నిజమైన కార్యకర్తలకు ఎన్నడూ అన్యాయం జరుగదన్నారు. ఈ ఎన్నికలతో సంబంధం లేని కొంతమంది తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన వాపోయారు.