ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి రోశయ్యతో సహా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఓ వినతి పత్రం కూడా సమర్పించారు. యాభై ఏళ్లుగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవించి శాసనసభలో తీర్మానం చేయాలని ఆయన తన వినతి పత్రంలో సమర్పించారు.
అనంతరం ఆయన రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీని కూడా కలుసుకుని తెలంగాణా ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రి సమర్పించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ 2004లోనే స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు.
అందువల్లే తాను ఆమరణ నిరాహారదీక్షను ఈనెలాఖరు నుంచి చేపట్టనున్నట్టు తెలిపారు. తన దీక్ష వల్ల జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా కేసీఆర్ హెచ్చరించారు.
ఇదిలావుండగా, హైదరాబాద్ ఫ్రీ జోన్‌కు వ్యతిరేకంగా తెరాస, తెలంగాణా ఉద్యోగ సంఘాలు చేపట్టబోతున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ తెరాస శానసభాపక్షం నేత ఈటెల రాజేందర్ నేతృత్వంలోని మరో ప్రతినిధుల బృందం వామపక్షాలను కలిసి విజ్ఞప్తి చేశారు.