గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం చేపట్టిన అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదని, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు అందజేసిన సిఫార్సు లేఖల్లో సూచించిన వారికే టిక్కెట్లు కేటాయించామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు.
గ్రేటర్ టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం రసాభాసగా మారిన విషయం తెల్సిందే. డీఎస్‌తో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్‌లు డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నట్టు పలువురు ఆరోపించారు. ఈ సంఘటనలో శుక్రవారం రాజధాని ఒక్కసారి వేడెక్కింది.
ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు డీఎస్ తన నివాసం వద్ద శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరధితో సంబంధం లేని ఎమ్మెల్యేలే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు అందజేసిన సిఫార్సు లేఖల్లో సూచించిన వారికే టిక్కెట్లు కేటాయించామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థుల జాబితాతో పాటు ఈ సిఫార్సు లేఖలను కూడా పార్టీ అధిష్టానానికి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య అందజేశారని తెలిపారు.
టిక్కెట్ల కేటాయింపులో ప్రతి ఒక్కరినీ నూటికి నూరు శాతం సంతృప్తి పరచలేమన్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం సంతృప్తిగా ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ ప్రాంతంలో సంబంధం లేని వారే లేనిపోని రాద్ధాంతం చేస్తూ, సమస్యను రాజకీయం చేస్తున్నారని ధర్మపురి ఆరోపించారు.
ఇకపోతే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లను కైవసం చేసుకుని వైఎస్‌కు ఘన నివాళి అర్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో చేసిందన్నారు. ఆ అభివృద్ధే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమకు తిరిగి విజయం చేకూర్చి పెట్టిందని డీఎస్ గుర్తు చేశారు.