రాష్ట్ర సచివాలయాన్ని ముట్టిడించేందుకు ప్రయత్నించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఫలితంగా పలువురు కార్మికులు గాయపడ్డారు. వేతన సవరణ, తాత్కాలిక విధానంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించారు.
ఆ తర్వాత వందలాది మందిద ఆర్టీసీ కార్మికులు ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్క్ నుంచి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత సెక్రటేరియట్‌ను ముట్టడించాలని ప్రయత్నించారు. అయితే, కార్మికుల ప్రయత్నాలను ముందే పసిగట్టిన పోలీసులు సచివాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.
దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఇది ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కాగా, సమస్యల పరిష్కారం కోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలకు, రవాణా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు.
ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాలేదని, అందుకే ఈ ధర్నా, సచివాలయం ముట్టడికి యత్నించినట్టు యూనియనే నేతలు నాగేశ్వర రావు, మొహ్మద్ తెలిపారు. ఈ ముట్టిడి సందర్భంగా పలువురు కార్మికులు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కార్మికుల ఆందోళన కారణంగా జంటనగరాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా స్తంభించి పోయాయి.