ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యాజమాన్యంతో తమకేంటి సంబంధం అని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఒకే చిరునామా ఉన్నంత మాత్రాన తమకు వారికి సంబంధాలు అంటగడతారా అని ఆయన ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా, ఓఎంసీ అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి రోశయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేయడాన్ని ఆయన స్వాగతించారు.
మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మైనింగ్ వివాదం ఓఎంసీ యాజమాన్యానికి సంబంధించిందన్నారు. వీటితో తమకెలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. ఒకే చిరునామా, ఒకే బిల్డింగ్ ఉంటే పెట్టుబడులు పెట్టినట్టేనా అని ఆయన ప్రశ్నించారు.
తమ పత్రిక ఎడిటోరియల్ డైరక్టర్ రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణ పూర్తిగా చదివితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. తన తండ్రి పోయిన బాధ నుంచి తాను, తన కుటుంబం ఇంకా తేరుకోలేదన్నారు. అయినప్పటికీ.. పార్టీ ఆదేశిస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
గనుల కంపెనీలు లేదా వాటి యాజమాన్యం నుంచి జగన్‌కు గానీ ఆయనకు చెందిన సంస్థలకు గానీ ఒక్కరూపాయి ముట్టిందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తమపై కొందరు కక్షగట్టి లేనిపోని విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అంతకుముందు జగన్ ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తితో భేటీ అయ్యారు. ఈ భేటీలో గ్రేటర్ ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల్లో జగన్ ప్రచారం చేస్తే మరిన్ని స్థానాలు కైవసం చేసుకునే అవకాశముందని కొందరు మంత్రులు కృష్ణమూర్తికి విజ్ఞప్తి చేయగా, అధిష్టానం దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు.