ప్రజారాజ్యం పార్టీ అనుబంధ విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం స్వీకరించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగినట్టు వినికిడి.
తన అన్న, సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం చేసి, ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పిన తర్వాత ఆ పార్టీకి ప్రచార తురుపు ముక్కగా పవన్ కళ్యాణ్ ఎదిగారు. గత ఎన్నికల్లో పవన్ చేసిన ప్రచారమే ఆ పార్టీకి హైలెట్‌గా నిలిచింది. కాంగ్రెస్, తెదేపా నేతలను విడిచిపెట్టలేదు. ముఖ్యంగా, కాంగ్రెస్ నేతలపై దుమ్మెత్తి పోశారు. పంచెలూడదీసి కొట్టాలని పిలుపునిచ్చారు.
అదేసమయంలో ఎన్నికల్లో ప్రజారాజ్యం అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. ఆ మాటపై పవన్ నిలబడినట్టు ఉన్నారు. అందుకే యువరాజ్యం కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యాలయం ఛాయల్లో కూడా కనిపించడం లేదు.
అంతేకాకుండా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రావాలని చిరంజీవితో పాటు.. ప్రరాపా నేతలు ఎంతగానో ఆహ్వానిస్తున్నా ఆయన మాత్రం కిమ్మనకుండా ఉన్నారు. పులి చిత్రం షూటింగ్‌లో బిజిబిజీగా గడుపుతున్నారు. అంతటితో ఆగకుండా తన తదుపరి ప్రాజెక్టుపై పలువురు నిర్మాతలతో సమావేశమవుతూ కథా చర్చల్లో నిమగ్నమైవున్నారు. "దటీజ్ పులి".