తెలుగు మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు కె.రోజా తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు తహతహలాడుతున్నారు. అయితే, ఆమె రాకను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఒకదశంలో చంద్రబాబు సైతం విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అయితే, పార్టీ సీనియర్ నేతలైన ఎర్రన్నాయుడు, పయ్యావుల కేశవ్, రేవంత్‌రెడ్డిల ఒత్తిడికి బాబు సానుకూలంగా స్పందించారు. అయితే, ఆయన సతీమణి మాత్రం రోజాను తిరిగి పార్టీలో చేర్చుకోరాదని భర్తకు తెగేసి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రోజా రాజకీయ భవిష్యత్ ఇక ముగిసినట్టేనని తెలుస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ దుర్ఘటనలో మరణించక ముందు రోజా వైఎస్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి ఆయనను పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెల్సిందే. పనిలో పనిగా తెదేపా నేతలపై కూడా విమర్శలు గుప్పించింది. సొంత పార్టీ నేతలే తనను ఓడించారని ఆరోపించారు. ఆ తర్వాత.. సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఇంతలో వైఎస్ అకాల మరణం చెందారు. దీంతో ఆమె పార్టీలో చేరకుండానే కాంగ్రెస్ పార్టీ పక్షాన సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో వైఎస్ తనయుడు జగన్‌ను పరామర్శ పేరుతో పలుమార్లు కలిశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రోజా ఆ పార్టీలో చేరరాదనే నిర్ణయానికి వచ్చారు. అందుకే తిరిగి మాతృసంస్థ తెదేపా గూటికే చేరుకోవాలని భావిస్తున్నారు.
రోజాను తిరిగి తెదేపాలో చేర్చుకునేందుకు సంబంధించి తెదేపా అగ్రనేతలు ఎర్రన్నాయుడుతో పాటు ఇతరులు చంద్రబాబుతో గత రెండుమూడు రోజులుగా మంతనాలు సాగిస్తున్నారనీ, అయితే అందుకు ఆయన అంతగా రోజా రాక పట్ల సానుకూలంగా లేరని తెలుస్తోంది. ముఖ్యంగా.. బాబు సతీమణి భువనేశ్వరికి రోజా తిరిగి పార్టీలో చేరుతారన్న సమాచారాన్ని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకోవడం పట్ల అభాసుపాలవుతామనీ, ఇప్పటికే రోజా తెదేపాపై అనేక ఆరోపణస్త్రాలను సంధించారని భువనేశ్వరి తన భర్తకు గుర్తు చేశారు.
అంతేకాకుడా, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రోజా విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కూడా రోజాను తిరిగి పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వినికిడి. ఈ తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే రోజా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా ఆమెను చేర్చుకునే అంశంలో అనేక ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ ముఖ్యులు అంటున్నారు.