తన పట్ల, తన కుటుంబం పట్ల ఏదో ఒక రోజున దేవుడు కరుణ చూపుతాడని.. ఆ రోజున మీ అందరి ఆశీర్వాదవచనాలు ఫలించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపడుతానని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరంలో జరిగిన రోడ్‌షోలో జగన్ పాల్గొని ప్రసంగించారు.
మీ అందరి కోరిక మేరకు ఏదో ఒకరోజున సీఎం పీఠంపై కూర్చొంటానని అన్నారు. ఆ సమయం ఎంతో దూరంలో లేదన్నారు. దేవుని కృపాకటాక్షాలు తనపై పడిన రోజున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల నుద్దేశించి జగన్ ఉద్వేగంగా అన్నారు.
అంతకుముందు.. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై దుమ్మెత్తి పోశారు. పిల్లను ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది ఈ చంద్రబాబు నాయుడేనని వైఎస్ ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తితో దివంగత నేత, విశ్వసనీయతకు మారుపేరైనా వైఎస్.రాజశేఖర రెడ్డితో పోటీయా అంటూ ప్రశ్నించారు.
రెండు రూపాయల కిలోబియ్యాన్ని ఏకంగా 3.25 రూపాయలు పెంచి రూ.5.25కు విక్రయించిన చంద్రబాబు ఎక్కడా.. రూ.5.25 బియ్యాన్ని పేదల ఆకలి తీర్చేందుకు రెండు రూపాయలకు అందేలా చేసిన వైఎస్సార్ ఎక్కడా అని జగన్ పదేపదే గుర్తు చేశారు. ఇలా.. ఏ అంశంలోనైనా వైఎస్‌తో బాబును పోల్చలేమన్నారు.