కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు గాలి కుట్ర: వీహెచ్
శనివారం, 21 నవంబర్ 2009( 17:11 IST )
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను ఓడించేందుకు కర్ణాటక మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్ధన్ రెడ్డి కుట్ర పన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీహెచ్.హనుమంతరావు ఆరోపించారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఆయన వంద కోట్ల రూపాయలను రాష్ట్రానికి పంపారన్నారు.
దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. గాలి జనార్ధన్ రెడ్డి కంపెనీ పాల్పడిన మైనింగ్ మాఫియా కుంభకోణం హర్షద్ మహెతా కుంభకోణం కంటే పెద్దదని వీహెచ్ ఆరోపించారు. అందువల్ల హర్షద్ మెహతాను జైల్లో పెట్టినట్లే జనార్ధన్ రెడ్డిని కూడా కటకటాల వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి వంటి శక్తులను సమర్థిస్తే దేశానికి అంత్యంత ప్రమాదకరమన్నారు.
ఓబుళాపురం గనుల్లో లభ్యమైన ఇనుప ఖనిజాన్ని దేశంలోని స్టీల్ ప్లాంట్‌లకు తరలించకుండా, విదేశీ కంపెనీలకు తరలించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌ను తక్షణమే నిలిపివేసి, కృష్ణపట్నంలో నిల్వ ఉన్న ఖనిజాన్ని సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందంటూ సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఇచ్చిన నివేదికపై వీహెచ్ ఘాటుగా స్పందించారు.
ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయనున్నట్టు వీహెచ్ తెలిపారు. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తే రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి కూడు ముప్పేనని ఆయన అభిప్రాయపడ్డారు.