గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ బోణీ కొట్టడం కష్టమేనని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అభిప్రాయపడ్డారు. అందుకే ఎన్ని సీట్లు వస్తాయని ఆశించడం కంటే.. ఏ మేరకు ఓట్లు పడతాయి, ఎంతశాతం వస్తాయనే అంశాలే తమకు ముఖ్యమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ మరణాంతరం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో తెరాస పోటీకి దూరమైంది. దీంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండలని ప్రరాపా భావించింది.
అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రరాపా శ్రేణుల ఒత్తిడి మేరకు యాభై స్థానాల్లో తొలుత పోటీ చేస్తామని ప్రకటించగా, చివరకు ఈ స్థానాల సంఖ్య 64కు చేరుకుంది. ఆ తర్వాత పార్టీ అభ్యర్థుల తరపున చిరంజీవి ప్రచారం చేశారు. ఆ సమయంలో చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎన్ని సీట్లు వస్తాయన్నది ముఖ్యం కాదన్నారు.
తమ ఓటు బ్యాంకు ఏమేరకు పెరిగందనే అంశంపైనే తాము దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. అంటే ఆయన వ్యాఖ్యల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రరాపా ఒక్క డివిజన్‌లో కూడా గెలువలేదనే విషయం తేటతెల్లం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రరాపా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 12 శాతం ఓట్లను కైవసం చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ దఫా చిరంజీవి పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన అన్ని స్థానాల్లో ప్రచారం చేస్తుండటంతో ఎక్కువ శాతంలో ఓట్లు పడతాయని శ్రేణులు ఆశిస్తున్నారు.