ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణాకు జైకొట్టిన "యాష్కీ" మగాడు: కేసీఆర్ (Telangana | KCR | Madhu Yashki | Students | KU | TRS | Rosaiah)
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ఎంపీ మధుయాష్కీ నిజమైన మగాడు అని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం వరంగంలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణా విద్యార్థుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ఆవేశంగా ప్రసగించారు. ప్రత్యేక తెలంగాణాకు బహిరంగంగా మద్దతు తెలిపిన నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. నిజమైన మగాడుగా అభివర్ణించారు. అంతేకాకుండా, తాము సిద్ధిపేటలో తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అడ్డు తగిలితే సహించబోమని హెచ్చరించారు.
ఇలా చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ ఐకమత్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తాము పడిన అవమానాలు మీరూ (విద్యార్థులు) పడరాదనే ఉద్దేశ్యంతోనే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
అంతేకాకుండా తెలంగాణా ఉద్యమం ఒక్కరోజుతో అంతరించి పోయేది కాదన్నారు. తన దీక్షను ఆపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ పనికి పూనుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనని ఆయన ముఖ్యమంత్రి రోశయ్యను హెచ్చరించారు. రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లను తలపించే రీతిలో తెలంగాణా కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాకుండా తెలంగాణా ప్రాంతాల్లో భూముల్లో 80 ఎకరాల్లో పలువురు సినిమా స్టూడియోలు నిర్మించారని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణాను పాలిస్తున్నది సినిమా తారలేనని కేసీఆర్ తారా స్థాయిలో ఆరోపించారు.