ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తమ మేనిఫెస్టోలో తెలంగాణపై హామీ ఇవ్వలేదు: గాదె (Manifesto | Congress | Home Minister | Chidambaram | Telangana | Gade Venkatareddy)
గతంలో 2004లో జరిగిన రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తెలంగాణ ఇస్తామని తాము హామీ ఇవ్వలేదని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు.
శుక్రవారం మంత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొనలేదని, తెలంగాణ అంశంతోనే కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చాయన్నారు.
గతంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన నేతలతో చర్చలు జరిపిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఆయన తెలిపారు.
ఇటీవల కేంద్ర హోం శాఖామంత్రి చిదంబర్ ప్రకటించిన నిర్ణయం కాంగ్రెస్ పార్టీది కాదని, న్యాయమూర్తులతో ఓ కమిటీ వేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాల్సివుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.