ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఈనెల ఐదో తేదీన కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం నిర్వహించతలపెట్టిన ఢిల్లీ పంచాయతీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకావడం లేదు. ఆయన తరపున తెలంగాణ నుంచి నాగం జనార్ధన్ రెడ్డి, సీమాంధ్ర తరపున ఎర్రన్నాయుడులను పంపాలని తెదేపా అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.
అంతేకాకుండా, ఈ సమావేశానికి హాజరయ్యే నాగం, ఎరన్నాయుడులు తమ వైఖరిని స్పష్టం చేయకుండా, కాంగ్రెస్ వైఖరిని తొలుత వెల్లడించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేయనున్నారు. ఆ తర్వాతే తమ అభిప్రాయాన్ని వెల్లడించాలనే ఉచిత సలహాను తెదేపా నేతలు చంద్రబాబుకు ఇచ్చారు.
ఇదిలావుండగా, తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడించిందని ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ పార్టీ తెలంగాణాపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించిందని తెదేపా వాదిస్తోంది. ఇలాంటి సందర్భంలో మళ్లీ తెలంగాణపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుండగా, కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు.. పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి, సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావులు హాజరుకానున్నారు.
అలాగే, తెరాస తరపున ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు, ప్రొఫెసర్ జయశంకర్, సీపీఎం తరపున రాఘవులు, జూలకంటిలు, ప్రరాపా తరపున పార్టీ అధినేత చిరంజీవి, సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావులు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీపీఐ, భాజపా, ఎంఐఎంల నుంచి హాజరయ్యే పేర్లను ఖరారు చేసే అంశంపై ఆ పార్టీ నేతలు తర్జనభర్జనలు చెందుతున్నారు.