కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో హోంశాఖామంత్రి పి.చిదంబరం చేసిన ప్రత్యేక తెలంగాణ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ ఏనాడూ చెప్పలేదని సరికొత్త వివాదం చేశారు. చిదంబరం వ్యక్తిగతంగా, యూపీఏ ప్రభుత్వం తరపున ఈ ప్రకటన చేశారన్నారని గుర్తు చేశారు.
దీనిపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. తెలంగాణా అంశాన్ని ఎప్పుడూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలిస్తే రెండో ఎస్సార్సీయే శరణ్యమన్నారు. లేకపోతే ప్రత్యేక న్యాయమూర్తిని నియమించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని గట్టిగా డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం కనీస ఉమ్మడి ప్రణాళిక (సిఎంపి)లో కూడా తెలంగాణా ఇస్తామని ఎక్కడా పేర్కొనలేదని ఆయన తెలిపారు.
ఒక తెలంగాణపై అన్ని వర్గాలతో చర్చలు జరిపి, ఏకాభిప్రాయ సాధనతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. అయితే, మంత్రి గాదె వెంకటరెడ్డి వ్యాఖ్యలను ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు తప్పుబట్టారు. ప్రతి సందర్భంలోనూ తెలంగాణాకు అనుకూలంగా కాంగ్రెస్ చెబుతూ వచ్చిందన్నారు. మేనిఫెస్టోలో, సీఎంపీలో, రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారని గుర్తు చేశారు.