ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మంత్రి కోమటిరెడ్డిపై వేటు తథ్యం: కాంగ్రెస్ నేతలు (Komatireddy | Congress | Rosaiah | Showcause notice | Telangana)
ముఖ్యమంత్రి కె.రోశయ్యపై విమర్శలు చేసిన రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అధిష్టానం చర్య తీసుకోవడం తథ్యమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కోమటిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రే స్వయంగా అధిష్టానాన్ని కోరడంతో ఆయనపై చర్య తప్పదని వారు అంటున్నారు.
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, తెలంగాణ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ఇటీవల రోశయ్యపై ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై సీఎం తీవ్రంగా నొచ్చుకున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న ఉద్యమాల కారణంగా పెట్టుబడిదారులు, చలనచిత్ర పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు తరలిపోవచ్చునని వ్యాఖ్యానించినందుకు రోశయ్యపై కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆంధ్ర, రాయలసీమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో రోశయ్య ఎందుకు మౌనం వహించారని ఆయన ప్రశ్నించారు.
మంత్రి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలన్నింటినీ అధిష్టానానికి సీమాంధ్ర నేతలు చేరవేశారు. పైపెచ్చు ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఫిర్యాదు చేయడంతో ఆయనపై చర్య తీసుకోవాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చింది. ఇందులోభాగంగానే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది.