సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమంపై మీడియా వివక్ష చూపుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. విజయవాడలో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. ఇందులో తెదేపాకు చెందిన గాలి ముద్దు కృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వర రావు, కోడెల శివప్రసాదరావు తదితర నేతలంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజిస్తే సహించబోమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీసే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలు కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు యోచిస్తున్నారని మండిపడ్డారు.
మీడియా కూడా సీమాంధ్ర ఉద్యమంపై వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. దేశంలో ఇప్పటికే విభజించిన చిన్న రాష్ట్రాలు ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ చేసే ఎలాంటి కుటిల యత్నాలనైనా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆయన ప్రకటించారు.