ప్రత్యేక తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని విభజన జరిగితే మాత్రం రాష్ట్రం అగ్నిగుండమవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. ఈనెల ఐదో తేదీన ఢిల్లీలో ఎనిమిది పార్టీల నుంచి అభిప్రాయసేకరణకు కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన తెలంగాణకు అనుకూలంగా ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
దీనిపై ఆయన తూర్పుగోదావరి జిల్లా తునిలో విలేఖరులలో మాట్లాడుతూ.. మరో ప్రకటనగానీ తెలంగాణకు అనుకూలంగా చేస్తే రాష్ట్రం అగ్నిగుండం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. 5వ తేదీన చేసే ప్రకటనపై చర్చించేందుకు శనివారం విజయవాడలో 13 జిల్లాల్లోని అన్ని పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి నేతలంతా హాజరై చర్చిస్తామని ఆయన తెలిపారు.
తమ పార్టీ సమైక్యవాదానికే కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే తన వైఖరిని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించడం భావ్యం కాదన్నారు. తెలంగాణాలోని రాజకీయ నిరుద్యోగులు రాష్ట్ర విభజనకు కుట్రపన్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆరోపించారు.