ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చిత్ర పరిశ్రమపై రోశయ్య వ్యాఖ్యలు కరక్టే: చిరంజీవి (Film Industry | Chiru | PRP | United Andhra | Srikakulam | Tour)
తెలుగు చిత్ర పరిశ్రమపై ముఖ్యమంత్రి కె.రోశయ్య చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం సరైనవేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రానికి చేరుకున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు ఒక్క పరిశ్రమలపైనే కాకుండా చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
ముఖ్యంగా వేర్పాటువాదులు ఆంధ్రాప్రాంతానికి చెందిన హీరోల షూటింగ్‌పై దాడులు చేయడం తీవ్రంగా ఖండించదగినదన్నారు. ఇది చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇకపోతే.. సమైక్యవాదం తెలంగాణ ప్రాంతాల్లోనూ చాపకింద నీరులా ఉందన్నారు. సమయం వచ్చినపుడు ఇది ఉవ్వెత్తున ఎగిసి పడుతుందనే విశ్వాసాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు.
ఇకపోతే.. రాష్ట్ర విభజనపై ఈనెల 5వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం నిర్వహించే ఎనిమిది పార్టీల సమావేశంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఏమాత్రం లేదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో సహా మిగిలిన పార్టీలు కూడా తమ వైఖరిని వెల్లడించాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. అందువల్ల రాజకీయ పార్టీలు ఆటలు సాగబోవన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, కష్టనష్టాల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.