తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు జరిపే ఈ పర్యటన వివరాలను తెదేపా ప్రధాన కార్యాలయం శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించింది.
ఈ పర్యటనలో భాగంగా ఈనెల ఎనిదిమితో తేదీ సోమవారం ఉదయం కింగ్‌ఫిషర్ ఎయిర్‌వేస్ విమానం ద్వారా హైదరాబాదు నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు బెంగళూరు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి దేవనహళ్లి, బంగారుపేట, కేజీఎఫ్‌ల మీదుగా రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11.30 గంటలకు రామకుప్పం చేరుకుంటారు.
అక్కడి పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రజలను కలుసుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటలకు గిడ్డపల్లి చేరుకుంటారు. తర్వాత బిరుగుండ్లపల్లి, తగర్లతాండాలను పర్యటించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
మధ్యాహ్నం 1.20 గంటలకు ననియాల సమీపంలోని అటవీశాఖ అతిథి గృహంలో కొద్దిసేవు విశ్రాంతి తీసుకోవడమేకాకుండా, అక్కడే మధ్యాహ్న భోజనం కూడా తీసుకుంటారు. 2.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ననియాల గ్రామాన్ని సందర్శిస్తారు. తర్వాత 3 గంటలకు రామాపురం తాండాలో రూ.1.64 లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీరాజ్ రహదారికి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేసి, తండాలో పర్యటిస్తారు.
అక్కడి నుంచి 89 పెద్దూరు గ్రామాన్ని సందర్శించి సాయంత్రం 4.30 గంటలకు ఆరిమానుపెంట గ్రామంలో 33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.45 గంటలకు వీర్నమల తాండాలో పశువైద్యశాల ఉప కేంద్రాన్ని ప్రారంభించి అక్కడి నుంచి బళ్ల గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు పెద్ద కూర్లపల్లి, గోవిందపల్లి, కంగుంది గ్రామాలను సందర్శించి రాత్రి 8 గంటలకు కుప్పం పట్టణంలోని రహదారులు- భవనాల శాఖ అతిథి భవనానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
తన రెండో రోజు పర్యటనలో మంగళవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు అతిథి గృహంలోని నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరిస్తారు. తర్వాత లక్ష్మీపురం ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన తర్వాత ఆ గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తారు.
ఆ తర్వాత ఉదయం 10.40 గంటలకు సామగుట్టపల్లి, 10.50 గంటలకు శీగలపల్లి, 11.20 గంటలకు దాసేగౌనూరులను సందర్శించి మధ్యాహ్నం 12 గంటలకు పాలారు అటవీశాఖ అతిథి గృహం చేరుకుని విలేఖరుల సమావేశం నిర్వహిస్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం తీసుకున్న అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు నాయనూరు, రెండు గంటలకు పెద్దవంక, 3 గంటలకు పెద్దవంక తిమ్మంపేటను సందర్శిస్తారు.
సాయంత్రం 3.40 గంటలకు తిమ్మంపేట నుంచి అలసందపురం మీదుగా బ్రహ్మదేవరచేన్లు చేరుకుంటారు. ఆ గ్రామంలో తమిళ పాఠశాలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు వాణియంబాడి మీదుగా చెన్నయ్ విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్‌కు వస్తారు.