ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » దామోదర్‌కు చెక్ పెట్టేందుకేనా జానాకు చోటు? (Damodar Reddy | Jana Reddy | Co-ordination committee | Telangana)
రాష్ట్ర సమన్వయ కమిటీ ద్వారా తెలంగాణ నేతలకు చెక్ పెట్టాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న రాంరెడ్డి దామోదర్ రెడ్డికి చోటు కల్పించకుండా, మాజీమంత్రి జానారెడ్డికి స్థానం కల్పించారు.
అంటే.. లౌక్యంగా మాట్లాడలేని జానాకు చోటు కల్పించిన అధిష్టానం.. తెలంగాణ ప్రాంత నేతలను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే తపనలో ఉంది. తాము చెప్పినట్టు తలాడించే నేతను ఎంపిక చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అందుకే దామోదర్‌ను కాదని జానారెడ్డికి చోటు కల్పించినట్టు ఆ ప్రాంత నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ఇకపోతే.. మరో మంత్రి గీతారెడ్డి. ఈమె ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అందువల్ల అధిష్టానం ఆదేశాలను ధిక్కరించేందుకు ఏమాత్రం సాహసం చేయలేక పోవచ్చు. పైపెచ్చు.. ఆది నుంచి వివాదాలకు దూరంగా ఉంటున్న మహిళా నేత. అందువల్ల ఈమె ఎంపిక వల్ల పార్టీ అధిష్టానానికి వచ్చే తలనొప్పులు ఏమీ ఉండవు. పైపెచ్చు.. అధిష్టానం తీసుకునే చర్యలకు గట్టి మద్దతు కూడా ఇస్తారు.
ఈ నేపథ్యంలో అందరి దృష్టి మాజీ మంత్రి, సీనియర్ నేత ఆర్.దామోదర్ రెడ్డిపైనే కేంద్రీకృతమై ఉంది. ఉద్యమంలో ఆది నుంచి అగ్రభాగంలో ఉంటున్నారు. కేసీఆర్‌తో మంతనాలు.. విద్యార్థులతో ముఖాముఖీ భేటీలు.. మీడియా ముందు హల్‌చల్.. ఇలా ప్రతి దానిలోనూ ముందు వరుసలో ఉంటున్నారు. ఇది మిగిలిన 'టి' కాంగ్రెస్ నేతలను కాస్త ఇబ్బంది కలిగించింది.
ఆయన అలా చురుకుగా వ్యవహరిస్తుంటే.. తాము మొక్కుబడిగా అయినా తలాడించాల్సి వస్తుందని పలువురు అంటున్నారు. అంతేకాకుండా, దామోదర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తెరాస అధినేత కేసీఆర్ వారసత్వాన్ని స్వీకరించినట్టుగా ఉన్నారనే విమర్శలు వచ్చాయి. గతంలో కేసీఆర్ మాత్రమే ఇతరులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసేవారు. ఆ బాధ్యతలను ఇపుడు దామోదర్ స్వీకరించారని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
ఇలా.. అన్ని అంశాలను బేరీజు వేసిన పార్టీ హైకమాండ్.. దామోదర్‌కు చెక్ పెట్టాలని భావిస్తోంది. అందువల్లే ఆయనకు సమన్వయ కమిటీ నుంచి పక్కన పెట్టారు. దామోదర్‌పై చర్య తీసుకోవడం వల్ల మిగిలిన నేతలను దారికి తేవాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి శనివారం దామోదర్ చేసిన వ్యాఖ్యలు కూడా మరింత బలాన్ని చేకూర్చి పెడుతున్నాయి.
సమన్వయ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను పీసీసీ చీఫ్ శ్రీనివాస్‌కు అప్పగించాలని, వైస్ ఛైర్మన్‌గా రోశయ్యను నియమించాలని కోరడం కూడా అధిష్టానానికి ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అక్కసుతోనే దామోదర్ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారనే ఊహాగానాలు బలంగా వినొస్తున్నాయి.
మొత్తం మీద హైకమాండ్ తీసుకున్న సమన్వయ నిర్ణయం పలువురు నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. మరికొందరి ఉద్యమ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. సమన్వయ కమిటీ చెప్పిన తర్వాత కూడా దారిలోకి రాని నేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తోందని ఢిల్లీ వర్గాల సమాచారం.