ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఉపకులపతుల గుండెల్లో "సింహం" మన గవర్నర్! (Vice Chancellor | Governor | Narasimhan | Versity | Students | Hyd)
రాష్ట్రా తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. రాజకీయ నేతలను హడలెత్తించిన గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్.. ఇపుడు విశ్వవిద్యాలయాల ఉప కులపతులపై దృష్టి సారించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పుణ్యమానికి రాష్ట్రంలోని అన్ని వర్శిటీలు రాజకీయ వేదికలను తలపిస్తున్నాయి.
దీనిపై వర్శిటీల కులపతిగా (ఛాన్సలర్)గా ఉన్న గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. విద్యా సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఆయా వర్శిటీల వైస్ ఛాన్సర్లపైనే ఉందని ఆయన హెచ్చరించారు. అలాగే, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను యధావిధిగా నిర్వహించాలని, ఈ అంశంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని ఆయన ముక్కుసూటిగా చెప్పారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గవర్నర్ అధ్యక్షతన వైఎస్ ఛాన్సలర్ల సదస్సు జరుగుతోంది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. వార్షిక ప్రణాళిక దెబ్బతింటే వీసీలపై చర్య తీసుకుంటామని, విధుల్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా.. ఉద్యోగాలు ఊడుతాయని హెచ్చరించారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంలో మన రాష్ట్రం ముందు స్థానంలో ఉందని, ప్రధానంగా అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంవైపే చూస్తున్నాయని గుర్తు చేశారు.
అందువల్ల విద్యలో వెనుకడుగు వేస్తే సహించలేదని తెలిపారు. ఇకపై.. ప్రతి మూడు నెలలకొకసారి వర్శిటీలు ప్రగతి నివేదిక తనకు సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని వర్శిటీలకు చెందిన విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని గురుతర బాధ్యత ఉపకులపతులపైనే ఉందని ఆయన సూచించారు.