ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్లు చెల్లవని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్టు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ తెలిపారు.
సోమవారం వెలువడిన హైకోర్టు తీర్పుపై ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, ప్రభుత్వం జారీ చేసిన జోవోను హైకోర్టు కొట్టి వేసినట్టు తమకు తెలిసిందన్నారు.
అయితే, ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లడగా, ఆయన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
అయితే, ప్రస్తుతానికి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు ప్రకారం లబ్ధి పొందుతున్న యువతీ యువకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని షబ్బీర్ ఆలీ తెలిపారు.
ఇదిలావుండగా, హైకోర్టు తీర్పునకు నిరసనగా హైదరాబాద్‌లో ఎంఐఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీని ముట్టిడించేందుకు వారు భారీ ర్యాలీగా వచ్చారు. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.