"అదుర్స్" చిత్ర నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడాలి నాని తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెరాస నాయకుడు హరీశ్‌రావు డిమాండ్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో బతిమాలితేనే అదుర్స్ చిత్రాన్ని వదిలిపెట్టామనీ, అసలు తాము తలచుకుంటే ఆంధ్ర నాయకులు హైదరాబాదులో తిరగలేరని హరీశ్ హెచ్చరించారు.
అదుర్స్ చిత్రాన్ని అడ్డుకుంటామన్న తెరాస, ఆ విషయంలో ఎంతమేరకు సఫలమైందీ...? అని ప్రశ్నిస్తూనే హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తాం.. అంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ఎంతమంది నాలుకలు కోశాడని కొడాలి నాని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించాడు. దీంతో తెరాస నానిపై మండి పడింది. తాము తలచుకుంటే ఆంధ్రకు చెందిన నాయకులు రాష్ట్రరాజధానిలో తిరగలేరన్నారు.
ఇదిలావుండగా అదుర్స్ చిత్రం నిర్మాత వ్యాఖ్యలు తెలంగాణా ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని కొందరు విద్యార్థులు ఆ చిత్రానికి సంబంధించిన రీళ్లను దగ్ధం చేశారు. మోహన్ బాబు కూడా తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పలుచోట్ల "బిందాస్" చిత్రాన్ని అడ్డుకున్నారు.