ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రభుత్వం మనుగడ దినదిన గండంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు జోస్యం చెప్పారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఏ క్షణమైన కూలిపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే.. తమకు తెలంగాణ ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు. వారి సూచన మేరకే తాము ముందుకు సాగుతామన్నారు.
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను ఆలస్యం చేయాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య కేంద్రాన్ని కోరారని ఆరోపించారు. అందువల్లే ఈ అంశంలో కేంద్రం జాప్యం చేస్తోందన్నారు. ఆయన పేరుకు మాత్రం రెండు ప్రాంతాలు సమానమని పైకి చెపుతున్నా.. లోలోపల మాత్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా లాబీయింగ్ చేస్తున్నారని హరీష్ ఆరోపించారు.
ఇకపోతే.. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదన్నారు. ప్రధానంగా సీమాంధ్ర నేతలు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం సహించబోమన్నారు.