ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అయ్యా.. మీ రాజీనామాలు చెల్లవ్: కిరణ్ కుమార్ రెడ్డి (Telangana | AP | Speaker | Congress | PRP | MLAs | Resignations)
అయ్యా.. మీ రాజీనామాలు చెల్లవ్: కిరణ్ కుమార్ రెడ్డి
తమ పదవులకు రాజీనామా చేసిన కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన ముగ్గురు సభ్యుల రాజీనామా లేఖలను స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. కాంగ్రెస్ సభ్యులు ఆర్.దామోదర్ రెడ్డి, చెరకు ముత్యం రెడ్డి, ప్రరాపా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు మనస్పూర్తిగా రాజీనామాలు చేయలేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు వారు ముగ్గురితో స్పీకర్ సమావేశమైన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లిన వీరు.. గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత వారు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. వారి వెంట రాష్ట్ర కార్మిక మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. తాము రాజీనామాలను స్వచ్చంధంగా చేయలేదని ముగ్గురు సభ్యులు స్పీకర్‌కు విన్నవించారు.
దీంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి సరిగ్గా ఒక్కరోజు ముందు వీరు ముగ్గురితో పాటు.. 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెల్సిందే.
వీరిలో తెరాసకు చెందిన పది మంది, భాజపాకు చెందిన ఒక సభ్యుడు ఉన్నారు. వీరి రాజీనామాలతో పాటు అంతకుముందు రాజీనామా చేసిన తెదేపా సభ్యుడు చెన్నమనేని రమేష్ రాజీనామాలపై స్పీకర్ ఆమోదించిన విషయం తెల్సిందే.