ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణ వ్యాప్తంగా శాంతియుత నిరసనలు: టి ఐకాస (Telangana | Srikrishna | JAC | Kodandaram | Hyd | Singareni | Bandh)
జస్టీస్ శ్రీకృష్ణ కమిటి రాకను నిరశిస్తూ తెలంగాణ వ్యాప్తంగా శాంతియుత నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయించింది. ఇందులోభాగంగా ఈనెల నాలుగు, ఐదు తేదీల్లో హైదరాబాద్‌లో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని నిరసన తెలుపాలని నిర్ణయించినట్టు ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్ తెలిపారు.
దీనిపై ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ రాకను వ్యతిరేకిస్తూ రెండు రోజులు పాటు తెలంగాణ ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే, సింగరేణి కార్మికులు చేపట్టిన 24 గంటల బంద్‌కు కూడా ఐకాస మద్దతు ప్రకటించింది.
తాము చేపట్టే నిరసన కార్యక్రమాలు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి కాకుండా ఆ కమిటీని వేసిన కేంద్రాన్ని ఉద్దేశించి నిర్వహిస్తున్నట్టు ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయకుండా గ్రామాల్లోకి రావద్దంటూ తెలంగాణ ఐకాస పోస్టర్లను విడుదల చేసింది.
ఇకపోతే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలవుతాయని ఆయన జోస్యం చెప్పారు. అలాగే, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటులో కూడా ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మరో ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.