ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని హంస గ్రానైట్ క్వారీ ప్రమాదంలో అశువులు బాసిన ఒక్కో మృతుని కుటుంబానికి 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. చీమకుర్తి గని ప్రమాదంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెద్దల ప్రాణాలను, పేదల ప్రాణాలను ఒకేలా చూడాలని హితవు పలికారు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో దివంగ ముఖ్యమంత్రి వైఎస్సార్ దుర్మరణం పాలైతే ఎంతగా బాధపడ్డామో... క్వారీ ప్రమాదంలో మరణించిన కూలీల పట్ల కూడా అదేవిధంగా విచారం వ్యక్తం చేయాలన్నారు.
క్వారీ ప్రమాదం జరిగి ఐదు రోజులైనా ఇంకా బండరాళ్ళను తొలగించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఐదు రోజులుగా మృతదేహాలు బండరాళ్ల కింద ఉన్నాయని, ఇవి దుర్గంధం వెదజల్లుతుంటాయని అన్నారు.