రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైన బేగంపేట ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. అట్టహాసంగా ప్రారంభమైన ఎయిర్‌షో వేడుకల్లో ఆరంభంలోనే అపశృతి చోటు చేసుకుంది. నేవీకి చెందిన నాలుగు సూర్యకిరణ్ విమానాలు ఆకాశంలో సాహస విన్యాసాలు చేస్తుండగా, అందులో ఒకటి అకస్మాతుగా జనావాసాలపై కూలిపోయింది.
ఈ విమానం న్యూ బోయిన్‌పల్లిలోని మూడు అంతస్తుల భవనంపై కుప్పకూలింది. ఈ విమానాన్ని హెచ్‌జడ్‌టీ-32గా గుర్తించారు. అయితే, విమానం కూలిపోయేందుకు కొన్ని క్షణాల ముందు అందులోని పైలట్లు ప్యారాచూట్ల ద్వారా కిందికి దూకేశారు. వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన ఏవియేషన్ షోలో వివిధ రకాలు విమానాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది.
విమానం కూలిన వెంటనే దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగినప్పటికీ.. వాటర్ ట్యాంకు పగిలి పోవడంతో మంటలు పెద్దగా వ్యాపించలేదు. ఈ సంఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కాగా, ఘటనా ప్రాంతానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు.